4, డిసెంబర్ 2016, ఆదివారం

శ్రీ చిద్విలాసా .....

ఇలలోన కలలోన నెలవు నెలవులలోన
పలుకులో పాటలో పరమాత్మవూ నీవె

నీవు లేనీ చోటు నింగిలో నేలలో
నెలవుగా లేదురా శ్రీసాయి రాజా !/ఇల/

పుడమిపై మొలకెత్తి పొలుపుగా వికసించు
రంగు రంగుల పూల రంగులోనూ నీవె /ఇల/

పిందెలై కాయలై ప్రియమార పండిన
మధుర ఫలముల లోని మధువులూ నీవే/ఇల/

జల జలా ప్రవహించు జలరాశియూ నీవె
తళ తళా మెరయు గిరిశిఖరమూ నీవె /ఇల/

వెలుగులు విరజిమ్ము విశ్వాంతరాళాన
వెలుగువై నీవుండ వెరపేమిరా మాకు/ఇల/

దారి నీవేయని దరిజేరినామురా
దారి జూపించి మా దిక్కుగా నిలుమురా/ఇల/

శ్రీసాయినాదా ! చేదుకోరా మమ్ము
శ్రీయోగి రాజా ! చింతలను దీర్చరా /ఇల/

శ్రీమంగళాకార ! చేరి కొలుతుము నిన్ను
శ్రీచిద్విలాసా ! సిరులివ్వరా మాకు  /ఇల/


30, నవంబర్ 2016, బుధవారం

కృష్ణ రారా .. చిన్ని కృష్ణ రారా .....

కృష్ణ రారా
చిన్ని కృష్ణ రారా
ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా
ఆరగించి వరములిచ్చి ఆదుకోరా

స్వఛ్ఛమైన మనసులన్ని పాల సమానం
పాలు చిలికి తీయు వెన్న ప్రేమ సమానం
ప్రేమ వెన్న నైవేద్యం ప్రియమని నమ్మితి కృష్ణా   || కృష్ణ రారా ||

తర తరాల తల్లి ప్రేమ   త్రచ్చి వెన్న తినిపించెను
మమకారపు పిచ్చి ప్రేమ    కుమ్మరించి యశోదమ్మ || కృష్ణ రారా ||

అనురాగపు ప్రేమ వెన్న    పెన వేయుచు తిని పించెను 
మనసున తనువున    తానై అణువణువున రాధమ్మ     || కృష్ణ రారా ||

తరగని ప్రేమల వెన్నలు    తరచి తరచి తినిపించిరి
తమను తాము అర్పించుచు    తరుణులు గోపిక రమణులు   || కృష్ణ రారా ||

అడుగడుగున నడయాడుచు    ఆడి పాడి చెలిమి వెన్న
వనమున యమునా వనమున    తినిపించిరి గోపాలురు         || కృష్ణ రారా ||

తెలుగుల తేనియలద్దిన    పద్య సుధల భాగ్యనిధులు
భాగవతపు భక్తి వెన్న     తినిపించెను పోతన్న                  ||  కృష్ణ రారా  ||

19, నవంబర్ 2016, శనివారం

శ్రీ శ్రీనివాసా శ్రీవేంకటేశా .....

శ్రీ శ్రీనివాసా  శ్రీవేంకటేశా
ఇలవేల్పు నీవయ్య  ఇందిరా రమణా

కలియుగ దైవమై ఘనవైభవముతోడ
తిరుమల గిరులపై తిరముగా నిలిచావు /శ్రీశ్రీని/

దివ్య మంగళ మూర్తి దేదీప్యమానమై
భక్త కోటికి కనుల పండుగై వెలిశావు /శ్రీశ్రీని/

నిత్య కళ్యాణాలు పచ్చతోరణ ప్రభలు
అనుదినోత్సవములు అరుదైన సేవలు /శ్రీశ్రీని/

కోరిన జనులకు కొంగు బంగారమై
వరముల గుప్పించు వరదాన గుణశీల/శ్రీశ్రీని/

18, నవంబర్ 2016, శుక్రవారం

పరమాత్మ కృష్ణుని భాగవత లీలలలో .....

పరమాత్మ కృష్ణుని భాగవత లీలలలో
భరత భూమి పునీతయై తరించెను గదా

కోరి గొల్లలతోడ గూడి పెరిగిన తీరులో
తీరైన యల్లరి తెలిసి మురిసెను గదా /బాల్య/

రాధికా గోపికా రమణుల ప్రేమలతో
కడు మనోహర ప్రేమ కావ్యమే నడిచె గదా /బాల్య/

కంసాది రాక్షస హింసాది యిడుములు బాసి
జనులెల్లరభయ ప్రశాంతత బొందిరి గదా/బాల్య/

మోహనాకారుని మురళీగాన మోహితుమయి
తడిసి జగతి యమృతత్వ సిధ్ధి పొందెను గదా/బాల్య/

సారపు ధర్మము సరి విమల సత్యముల కండయై
తరియింపగా తాను దైవమై నిలిచె గదా/బాల్య/

17, నవంబర్ 2016, గురువారం

రాముడే రాజుగా రక్షగా జగతికి .....

రాముడే రాజుగా రక్షగా జగతికి
త్రిభువనములు కొలిచేను త్రేతాయుగాదిగా

ఒక్కటే మాటగా ఒక్కటే శరముగా
ఒక్క సీతకె పతిగ యుగపురుషుడై నిలిచె /రాముడే/

తల్లి దండ్రుల మాట తలదాల్చి కడదాక
పడరాని యిడుముల పడిన శ్రీ /రాముడే/

అన్నగా తమ్ములకు ఆదర్శమూర్తిగా
మన్ననలు పొంది యీ మనుజులందరకు /రాముడే/

రావణుని చావుతో రామబాణము శక్తి
రామనామము శక్తి రాజిల్లి లోకాన /రాముడే/

గ్రామ గ్రామాన శ్రీరామ మందిరాలు వెలసి
జగములన్నింట సకల జన హృన్మందిరాలలో/రాముడే/