30, నవంబర్ 2016, బుధవారం

కృష్ణ రారా .. చిన్ని కృష్ణ రారా .....

కృష్ణ రారా
చిన్ని కృష్ణ రారా
ప్రేమ వెన్న నైవేద్యం పెట్టినానురా
ఆరగించి వరములిచ్చి ఆదుకోరా

స్వఛ్ఛమైన మనసులన్ని పాల సమానం
పాలు చిలికి తీయు వెన్న ప్రేమ సమానం
ప్రేమ వెన్న నైవేద్యం ప్రియమని నమ్మితి కృష్ణా   || కృష్ణ రారా ||

తర తరాల తల్లి ప్రేమ   త్రచ్చి వెన్న తినిపించెను
మమకారపు పిచ్చి ప్రేమ    కుమ్మరించి యశోదమ్మ || కృష్ణ రారా ||

అనురాగపు ప్రేమ వెన్న    పెన వేయుచు తిని పించెను 
మనసున తనువున    తానై అణువణువున రాధమ్మ     || కృష్ణ రారా ||

తరగని ప్రేమల వెన్నలు    తరచి తరచి తినిపించిరి
తమను తాము అర్పించుచు    తరుణులు గోపిక రమణులు   || కృష్ణ రారా ||

అడుగడుగున నడయాడుచు    ఆడి పాడి చెలిమి వెన్న
వనమున యమునా వనమున    తినిపించిరి గోపాలురు         || కృష్ణ రారా ||

తెలుగుల తేనియలద్దిన    పద్య సుధల భాగ్యనిధులు
భాగవతపు భక్తి వెన్న     తినిపించెను పోతన్న                  ||  కృష్ణ రారా  ||

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి